ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ఇక్కడే ముఖ్యం. ఇప్పుడు వైసీపీ గాలిలో గెలిచి జగన్ పై ఎదురుతిరిగిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి దేవేందర్ రెడ్డి. తనతో ఫైట్ పెట్టుకున్న రఘురామను చెడుగుడు ఆడేస్తున్నారు.
వైసీపీకి రఘురామ కృష్ణం రాజు చేసిన నమ్మకద్రోహంపై ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాలో ఆయనను ఉతికి ఆరేస్తున్నారు. ఈ క్రమంలోనే రఘురామకృష్ణం రాజు నిన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి తనపై సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి దేవేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. అంతేకాదు.. నిన్న రాత్రి టీడీపీ అనుకూల మీడియా చానెల్స్ డిబేట్స్ లో పాల్గొని అవాకులు చెవాకులు పేల్చుతూ రెచ్చిపోయారు. వీటికి తాజాగా వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి దేవేందర్ రెడ్డి సోషల్ మీడియా సాక్షిగా సమాధానమిచ్చాడు.
ఎంపీ రఘురామకు కౌంటర్ ఇస్తూ దేవేందర్ రెడ్డి తాజాగా ఫేస్ బుక్ లో సంచలన సమాధానాలిచ్చారు.. ‘‘సభ్యసమాజం ఈసడించుకునేలా ప్రెస్ మీట్లు పెట్టి, చూపించడానికి పచ్చ చానళ్లు ఉన్నాయని.. అరుపులు, కేకలు వేస్తూ మాట్లాడుతున్న మీరు ఒక ఎంపీ అంటే నమ్మడానికి కష్టంగా ఉంది’’ అని దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, తల్లిపాలు తాగి రొమ్ముగుద్దుతున్నట్టుగా మాట్లాడుతున్న మీరు మళ్లీ నైతికత గురించి మాట్లాడటం పరాకాష్ట అని రఘురామకృష్ణం రాజును కడిగేశారు..
ఇక సదురు టీవీ చానెల్స్ లో దేవేందర్ రెడ్డిని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణం రాజు కు అంతే ఘాటుగా సమాధానాలిచ్చారు. ‘నల్లగా ఉన్నాడని.. పొట్టిగా అంటూ.. నన్నేదో కించపరిచాలని మీరు భావిస్తున్నట్టున్నారు. అయితే భారతదేశంలో మీలాగా విగ్గు పెట్టుకుని ప్రపంచానికి అందగాడిగా ప్రమోట్ కావాలని ప్రయత్నించే వాళ్లు ఎంతమంది ఉంటారో కానీ, భారతదేశంలో నల్లగా ఉన్నారని ఎవరినైనా తిడితే వివక్షకు సంబంధించిన కేసులు పెట్టవచ్చు’’ అంటూ రఘురామను ఎండగట్టారు. ఒకవైపు ప్రపంచంలో ఎవరినైనా నల్లగా ఉన్నారని అంటే.. అలా దూషించే వారిని మనుషుల్లా చూడటం లేదు. ఈ లెక్కన మీరు మనిషవుతారా? అంటూ రఘురామ వర్ణవివక్షను దేవేందర్ రెడ్డి నిలదీశారు.
ప్రెస్ మీట్లో మీ అరుపులు, కేకలు చూస్తే.. మీ మానసిక పరిస్థితి గురించి అనుమానించాల్సి వస్తోందని దేవేందర్ రెడ్డి విమర్శించారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కుల ముద్ర వేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఆకాశాన్ని చూసి ఉమ్మేసినట్టుగా ఉందని దేవేందర్ రెడ్డి విమర్శించారు. బడుగు బలహీన వర్గాల నేతలకు, ప్రజలకు పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని కొనియాడారు. అలాంటి ప్రభుత్వం మీద కుల ముద్ర వేయాలనే మీ కుటిల ప్రయత్నాలు నవ్వులపాలవుతావ్ అంటూ హెచ్చరించారు..
దేవేందర్ రెడ్డి తన పోస్టులో రఘురామకృష్ణం రాజుతోపాటు టీవీ5 , ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై కూడా ప్రశ్నలు ఎక్కుపెట్టి పచ్చమీడియాను కడిగేశారు.
రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలకు కౌంటర్ గా దేవేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. వైసీపీ సోషల్ మీడియాకి వారియర్ గా దేవేందర్ రెడ్డి ఉంటాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. దేవేందర్ రెడ్డికి సోషల్ మీడియాలో మద్దతు లభిస్తోంది.
Recent Comments