రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈనేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కనీసం సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం హడావుడిగా పట్టుబట్టి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం వెనుక కమలనాథుల కుట్ర కోణం దాగివుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకుల సలహా మేరకే ఈనెల 25న సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ సమాచారం ఇచ్చింది అయితే కేంద్ర జలశక్తి మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో సమావేశాన్ని వాయిదా వేశారు.

అనాదిగా వివాదం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వున్నప్పటి నుంచి అంతరాష్ట్ర నీటి పంపకాలకు సంబంధించి వివాదాలు నడుస్తూనే వున్నాయి. ఈ వివాదం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. కృష్ణా జలాలకు సంబంధించి లభ్యత తక్కువగా ఉండి వినియోగం పెరుగుతుండడంతో గత నాలుగు దశాబ్దాలుగా అంతరాష్ట్ర వివాదాలు తీవ్రమయ్యాయి. నీటి పంపకానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపు అమలులోకి రావాల్సి ఉంది. ఈ సమయంలోనే తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర – తెలంగాణ విడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉంటున్నాయి. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ కనుచూపుమేరలో కూడా ఉనికిని చాటుకొనే పరిస్థితి లేదు.

కమలనాథుల చూపు తెలంగాణా వైపేనా…
ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణాలో బీజేపీ బలపడేందుకు అవకాశాలు ఎక్కువగా వున్నాయని భావించిన బీజేపీ అధి నాయకత్వం ఈ జలవివాదంలో తెలంగాణ కు అనుకూలంగా ప్రవర్తించి ముఖ్యంగా దక్షిణ తెలంగాణాలో పాగా వేసేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడం ద్వారా అక్కడి ప్రజల్లో సానుకూలత పొందేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర మంత్రి ఏపి ప్రతినిధులతో మాట్లాడినట్లు తెలిసింది. అదే విధంగా కొత్తపథకం కాదంటూ ఎన్జీటి కమిటి ఇచ్చిన ఆదేశాలను స్క్రూట్ని చేయిస్తూ ఆ ఆదేశాలు రివర్స్ చేయించేందుకు ప్రయత్నిస్తోందట. ఎందుకు ఇంత పట్టుదలతో బిజెపి వ్యవహరిస్తోంది.

సాగునీటి రంగానికి తెలుగు రాష్ర్టాల ప్రాధాన్యతే కన్నుకుట్టిందా?

ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లోనూ సాగునీటి రంగానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందులో భాగంగా కాళేశ్వరం, పోలవరం లాంటి ప్రాజెక్ట్లు గోదావరిపై నిర్మిస్తుండగా కృష్ణా నీటి ఆధారంగా తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి, డిండి, ఉదయసముద్రం, ఎస్ఎల్బిసి లాంటి ప్రాజెక్ట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఏపిలో హంద్రి-నీవా, గాలేరు-నగరి తదితర ప్రాజెక్ట్లు నిర్మాణం చివరిదశలో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లు పూర్తి చేసినప్పటికీ కృష్ణాలో నీటి సమస్య ఎదురయ్యే పరిస్థితి లేదు. తరచూ వరద నీరు వృధా అవుతోంది. గత ఏడాది 600 టిఎంసీలు వృధా అయ్యింది. ఒకవేళ కృష్ణాలో నీటి సమస్య ఎదురైనప్పటికీ గోదావరి నీటి మళ్లింపు ఆధారంగా అధిగమించడం వీలవుతుంది. పోలవరం పూర్తయిన తరువాత, తాజాగా చేపట్టిన కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం పూర్తయిన తరువాత కృష్ణా నదిపై ఆధారపడడం నాగార్జున సాగర్ నుంచి తగ్గిపోతుంది. తెలంగాణాలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఏర్పడేందుకు వున్న అవకాశాలను ఉపయోగించుకొని బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బీజేపీ తెలుగు రాష్ట్రాల జలవివాదాన్ని తనకు అనుకూలంగా మలచుకొంటోది. ఇందులో ప్రజా ప్రయోజనాలకంటే పార్టీ ప్రయోజనలకే బీజేపీ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది.

వరదనీరు వృధాగా పోకుండా తెలుగు రాష్ట్రాలు కార్యాచరణ చేపట్టాలి…
శ్రీశైలం నుంచి వరదనీరు వృధాగా పోకుండా వినియోగించుకునే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పటిష్టమైన కార్యాచరణను అమలు చేయాలి. అందుకోసం శ్రీశైలం జలాశయాన్ని విద్యుత్ ఉత్పత్తితో పాటు పూర్తిగా సాగు, తాగు నీటి అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. తెలంగాణాలోని ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వర్షాధార పంటలు ఎక్కువగా పండిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ నాలుగు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ రెండు ప్రాంతాల్లోనూ తాగు, సాగు నీటి సౌకర్యాలు మెరుగుపరచడానికి పైన పేర్కొన్న సాగునీటి పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి.

కృష్ణా ఆధారిత ప్రాజెక్ట్ లపై మొదటి నుంచి నిర్లక్ష్యమే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వున్నప్పటి నుండి పాలకులు వెనుకబడిన దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా శ్రద్ధ చూపడం లేదనే అభిప్రాయం బలంగా ఉంది. దక్షిణ తెలంగాణలో సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోపాటు కృష్ణా నీటిని గరిష్టంగా వాడుకోవడం తెలంగాణకు సాధ్యమవుతుంది. మూడు సంవత్సరాలలో గోదావరి మీద కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర సృష్టించి దక్షిణ తెలంగాణ పట్ల నిర్లక్ష్యం ఎందుకు వహించారన్న విమర్శలు వున్నాయి. అదే విధంగా ఏపిలోని రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించడానికి వరద, మిగులు, నికర జలాల కేటాయింపు ఉన్నాయి. అందుకు సంబంధించి కొన్ని పథకాలు పూర్తయి మరికొన్ని పథకాలు నిర్మాణంలో ఉన్నప్పటికి కేటాయించిన నీటిని ఏపి వినియోగించుకోలేకపోతోంది.
ఏపిలో నీటిని వినియోగించుకోలేక పోతున్న పోతిరెడ్డిపాడు ఎత్తు సమస్య
శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 114 టిఎంసిల నీటిని వినియోగించాల్సి ఉండగా గత రెండు సంవత్సరాలు మినహాయిస్తే ఎప్పుడూ సగం వాటా నీటిని కూడా మళ్లించలేకపోయారు. తెలుగు గంగ 29 టిఎంసీలు, ఎస్.ఆర్.బి.సి 19, గాలేరు-నగరి-జిఎన్ఎస్ఎస్ 39, చెన్నైకి తాగు నీరు15, టిబిపిహెచ్ ఎల్ సి10, తాగు నీటి అవసరాలు- ఆవిరి నష్టాలు 3 టిఎంసీలు కలిపి మొత్తం రాయలసీమ 114 టిఎంసీల నీటిని వినియోగించుకోవాలి….

కేటాయింపు నీటిని వాడుకొనేందుకే రాయలసీమ ఎత్తిపోతలు….
కేటాయించిన కృష్ణానీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొని వృధాను అరికట్టేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపి ప్రభుత్వం చేపట్టింది. ఇది కొత్త పథకం కాదని ఎన్జీటి ఆదేశాల మేరకు ఏర్పడిని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటి తేల్చిచెప్పింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు లేనేలేదు. పాత ఆయకట్టుకు అంటే పైన పేర్కొన్న ప్రాజెక్టులకు కేటాయించిన నీరు ఎస్ఆర్ఎంసిలోకి వెళ్లేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకోసం సంఘమేశ్వర వద్ద పంపింగ్ కేంద్రాన్ని నిర్మించి నీటిని ఎస్ఆర్ఎంసిలోకి పోతిరెడ్డిపాడు సమీపంలో విడుదల చేస్తారు. అందువల్ల ఈ ప్రాజెక్ట్ను కొత్త ప్రాజెక్టుగా పరిగణించాల్సిన అవసరం లేదు. కేటాయించిన నీటిని ఉపయోగించుకునేందుకు మాత్రమే వీవుతుంది.

అన్ని పార్టీలు తేలుకుట్టిన దొంగలే..
తెలంగాణా లోని అన్ని రాజకీయ పార్టీలు దక్షిణ తెలంగాణాకు అన్యాయం జరిగితే సహించేది లేదని గొంతెత్తి అరుస్తుండగా ఏపీలోని రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తేలుకుట్టిన దొంగలా మిన్నకుండిపోయింది. కనీసం కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కూడా తెలంగాణలో వ్యతిరేకిస్తుండగా ఏపీలో మాత్రం నోరు మెదపడం లేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కడ ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడితే అధికార పార్టీకి అనుకూలం అవుతుందో అనే విద్వేషపూరిత రాజకీయ స్వార్థమే కనిపిస్తుంది. ఇక ఎల్లోమీడియా సరేసరి.

వాస్తవాలు చెప్పడంలో ఏపీ ప్రభుత్వం వైఫల్యం…
ఏపి ప్రభుత్వం కూడా పోతిరెడ్డిపాడు పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో వైఫల్యం చెందింది. ఈ ప్రాజెక్టు వలన ఒక్క టీఎంసీ కూడా అదనంగా తీసుకుపోమని రాజకీయంగా నచ్చజెప్పడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచలేకపోతోంది. ఇంతవరకు ముఖ్యమంత్రిగానీ, నీటి పారుదల శాఖ మంత్రిగానీ, లేదా అధికార పార్టీ నేతలుగానీ నోరు విప్పిందేలేదు. ప్రాజెక్ట్ కొత్తది కాదని, కేటాయించిన నీటినే వినియోగించుకుంటున్నామని రెండు రాష్ట్రాల ప్రజలకు అర్థమయ్యేరీతిలో వివరించడానికి ఆసక్తి చూపడం లేదు. దాంతో ఏపి ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని తెలంగాణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో అభిప్రాయం బలంగా ఉంది. ఇక్కడ ఏపి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.

రాష్ట్ర బిజెపి నిప్పుకి కేంద్రం ఆజ్యం పోస్తోందా…

తెలంగాణలోని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపిలు ముఖ్యమంత్రి ఏపి సీఎంతో కుమ్మక్కు కావడం వల్లనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని బలంగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. ఎన్జీటిలో కేసు వేసినప్పటికీ టెండర్ ప్రక్రియ నిర్వహించుకునేందుకు అనుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఇవన్నీ విచారణ జరగాల్సి ఉంది. ఈలోగా ఎన్జీటి ఆదేశాల మేరకు ఏపి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్ ప్రక్రియను ముగించింది. ఈ లోగా బిజెపి నాయకులు తెలంగాణలో మాట్లాడుతున్న విధంగానే కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెండు రాష్ట్రాల్లోనూ బిజెపి నాయకులు అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల అదే ధోరణితో వ్యవహిరస్తోంది. ఏపిలో ఇప్పుడు కాస్తా బిజెపి ధోరణి మారింది. కేంద్రంతో ఏపికి ఇప్పటికీ సఖ్యతగానే ఉంది. తెలంగాణలో అందుకు భిన్నంగా ఉంది. టిఆర్ఎస్ కు బిజెపికి సత్సంబంధాలు పూర్తిగా లేవనే చెప్పాలి. ప్రతీ చిన్న అంశంపైన బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తుంటే వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపడం జరుగుతోంది. గతంలో ఈ విధంగా వుండేది కాదు. పార్లమెంటు ఎన్నికల తర్వాతనే ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు చేసుకొంటున్నారు.

నీటి విషయానికి వస్తే కాళేశ్వరం మూడో టిఎంసీ పనులు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ బిజెపి నాయకులు చేసిన ఫిర్యాదులకు అనుకూలంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వన్ నేషన్ విధానాన్ని అన్ని విభాగాల్లోనూ అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పుడు నీటి పారుదల రంగంలో కూడా అదే ప్రయోగం చేస్తోంది. రాష్ట్రాల మధ్య ముఖ్యంగా తెలంగాణ, ఏపి మధ్య వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఇంజనీరింగ్ నిపుణులు సైతం అభిప్రాయ పడుతున్నారు.
రెండు రాష్ట్రాల జుట్టు తమ చేతుల్లో ఇరికించుకోవాలనే విధానం కనిపిస్తోంది. కాళేశ్వరం మూడో టిఎంసీ పనులు, పాలమూరు రంగారెడ్డి, డిండి, ఉదయ సముద్రం తో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి డిపిఆర్లు ఇవ్వాలని అప్పటిదాకా పనులు ఆపేయాలని కేంద్రం ఆదేశించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించవద్దని కేంద్రం ఆదేశించింది. ఈ విధంగా మొత్తం వ్యవహరాన్ని తమ కనుసన్నల్లో వుంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగూ పార్టీ బలపడే అవకాశాలు లేనందున తెలంగాణకు అనుకూలంగా వ్యవహిరస్తే కనీసం ఇక్కడైనా బలపడవచ్చనే రాజకీయ వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే రెండు రాష్ట్రాలు నష్టపోయే విధంగా కృష్ణా నీరు వృధాగా సముద్రం పాలయి అటు రాయలసీమ, ఇటు దక్షిణ తెలంగాణ శాశ్వతంగా కరువుబారిన పడతాయి.